Pages

Saturday, October 5, 2019

'మెగా'ద్భుతం...

Portrait of Legendary Tollywood Hero Chiranjeevi
from the movie- Sye Raa Narasimhaa Reddy
Watercolors on Paper (9" x 12")     


'మెగా'ద్భుతం - "చిరంజీవి" 'సైరా నరసింహా రెడ్డి'


తెలుగు సినిమా చరిత్రపుటల్లో నిలిచిపోయే సినిమాలు తెలుగు తెరపై ఆగిపోయి చాలాకాలమే అయ్యింది. మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి, గుండమ్మ కథ, అల్లూరి సీతారామరాజు, దాన వీర శూర కర్ణ, శంకరాభరణం, సాగర సంగమం...ఇలా ఆనాటి చిత్రరత్నాల్నే ఈనాటికీ మనం చెప్పుకుని గర్విస్తుంటాం. మొన్నొచ్చిన "బాహుబలి" తెలుగు సినిమాని కొత్త ఎత్తులకి తీసుకెళ్ళినా అది వీటి సరసన నిలిచే చిత్రం కాగలదా అన్నది కాలమే చెప్పాలి.

సైరా నరసింహా రెడ్డి - ఒక అధ్బుతమైన సమరయోధుడి గాధని తెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్ర"రాజం". బ్రిటీషు వాళ్ళు ఆ వీరుడి తల నరికి 30 సంవత్సరాలకి పైగా ఇంకెవరు ఎదురు తిరగాలన్నా భయపడేట్టు కోట గుమ్మానికి వేళ్ళాడగట్టారన్న చరిత్ర ఘట్టాన్ని ఒక్కసారి ఆలోచిస్తేనే ఆంగ్లేయులని ఆయనెంత భయపెట్టి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన మొట్టమొదటి తెలుగు"వాడి" గా ఆయన పేరు ఈ సినిమా వల్ల పూర్తిగా వెలుగు చూసింది, దీనివల్లనే ఇంతమందికీ తెలిసొచ్చింది.

చరిత్ర లో మరుగైన ఆ వీరుడి గాధని కధగా ఎంచుకుని, దానికి మెరుగైన నటుడ్ని ఎన్నుకుని, కధనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలనుకోవటం, తండ్రి చిరకాల కోరికని తీరుస్తూ, ఆయనకే కాక ఆయన్ని ఆరాధించే, అభిమానించే కోటానుకోట్ల అభిమానులకి కానుకగా ఇవ్వాలనుకోవటం నిజమైన సాహసం. ఈ సాహసాన్ని చాలా మంది చాలా సార్లు చేసినా, ఇప్పటిదాకా మెప్పించగలిగింది ఒక్క "సూపర్ స్టార్ కృష్ణ" మాత్రమే, "అల్లూరి సీతారామరాజు" గా తెలుగు వెండితెరపై ఎప్పటికీ ఇంకెవ్వరూ "అల్లూరిసీతారామ రాజు" గాధని ప్రయత్నం చెయ్య(లే)రు అంటే "కృష్ణ" గారు తెలుగు ప్రేక్షకుల్ని అంతగా మెప్పించారు కాబట్టే. అంతటి సాహసాన్ని ఇప్పుడు చేసి, "బాహుబలి" ఎక్కించిన శిఖర ఎత్తుల్లో ఎక్కి కూర్చుని ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించటం అంటే నిజంగా "కత్తి" మీద కాదు...ఏకంగా "కత్తి మొన" మీద సాము చెయ్యటమే. ఆ సాము చెయ్యగల సమర్ధత ఈ తరం హీరోల్లో ఉన్న ఏకైక, ఆ, ఈ-తరం నటుడు "మెగా స్టార్" చిరంజీవి.

ఏ నటుడ్ని అయినా ఒక పాత్రలో "ఒదిగిపోయి అందులో జీవించాడు" అనాలంటే, ప్రేక్షకుడి కళ్ళ ముందు ఆ నటుడు కాదు, ఆ పాత్ర కనబడాలి, ఆ పాత్రలో జీవం ఉట్టిపడాలి. చరిత్రలో ఎప్పుడో జీవించి మరుగైన "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" పాత్రలో సరిగ్గా ఈ అద్భుతమే చేశాడు "చిరంజీవి". ఆయన ధైర్యసాహసాల్ని తెలుగు ప్రేక్షకుల కళ్ళెదుట తెరపై ఆవిష్కరించి, ఆ సమరయోధుడ్ని వాళ్ల మదిలో చిరస్థాయిగా కట్టిపడేశాడు.

వందల ఏళ్ళు పరాయి పాలనలో కన్న భూమిపైనే తిండికీ, గుడ్డకీ, గూడుకీ నోచుకోక, బానిసలై బ్రతుకుని ఈడుస్తూ, రోజూ చస్తూ బ్రతుకుతూ జీవించే ప్రజలు తమ స్వేచ్ఛకై పరాయి పాలకులపై తిరుగుబాటు చేసి సాగించే "స్వాతంత్ర్య సమరం" ని మించిన సమరం ఈ భూమిపైన ఏ మానవాళి కీ ఉండదు. అది సాధించిన ఘనత భారతదేశానిదీ, భారతీయులదీ. ఎందరిలోనో స్ఫూర్తిని నింపి సమర శంఖం పూరించి ముందుండి ఉద్యమ సమరాల్ని  నడిపించిన వీరులు, వీరగాధలు మన చరిత్రలో ఎన్నో, ఎన్నెన్నో. అలాంటి ఒక వీరుడి పాత్రలో "చిరంజీవి" చూపిన అభినయం, చేసిన భీకర పోరాటాలూ, తెల్లవాడి ఎదుట రొమ్ము విరుచుకుని సింహం లా నిలబడి, వాడి పాలనని ధిక్కరిస్తూ, వాడి బలాన్ని సవాల్ చేస్తూ, మీసం తిప్పి "Get out of my Motherland" అంటూ గర్జించి, పోరాడి, చివరికి తన మరణమే జననం అంటూ ప్రాణాలొదిలి, చూసే ప్రతి ప్రేక్షకుడి మదినీ కదిలించి, కళ్ళల్లో కన్నీళ్ళని నింపిన పాత్రలో పూర్తిగా ఒదిగిన "చిరంజీవి" నటనా సామర్ధ్యం", "న భూతో, న భవిష్యతి"!

ఈ "చిత్రరాజం" ని ప్రతి తెలుగు వాడూ, ప్రతి భారతీయుడే కాదు, ప్రతి బ్రిటీషు వాడూ చూడాలి, చూసి తరించాలి!

ఈ సినిమాలో నటించిన నటులందరి నటనా, తెర వెనుకా తెరపైనా చూపించిన నైపుణ్యతా, దర్శకుని ఆలోచనా, తెరకెక్కించిన తీరుతెన్నులూ, పెట్టిన ఖర్చూ...అన్నీ ఎంతో ఉన్నత ప్రమాణాలతోనే ఉన్నాయి. ఈ సినిమా కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరూ అభినందనీయులే. ఎక్కడా రాజీ పడకుండా హృద్యంగా మలిచిన దర్శకుడు, నిర్మాత ప్రత్యేకించి "అభినందనీయులు".

సినిమా రంగంలో మొదటి మెట్టు నుంచీ "స్వయం కృషి" నే నమ్ముకుని, శ్రమిస్తూ, ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, మరెవరూ చేరుకోలేనన్ని ఉన్నత శిఖరాల్ని చేరుకున్నా, ఎదిగి ఒదిగిన వినయశీలీ, సౌమ్యుడూ, మృదుభాషి "చిరంజీవి" చిరంజీవ!

దాదాపు 35 ఏళ్ళ తరువాత నా చేతుల్లో ఒదిగి రూపుదిద్దుకున్న నా అభిమాన నటుడు "చిరంజీవి".

My Painting of Sri. Chiranjeevi and every single word in this blog post is my tribute to my favorite all-time Hero.

"A hero is a man who does what he can." - Romain Rolland

Details
Title: Portrait of Legendary Indian Actor Chiranjeevi
Inspiration: Sye Raa Narasimhaa Reddy, an epic Indian Movie
Mediums: Watercolors on Paper
Size: 9" x 12" (22.9 cm x 30.5 cm)
Surface: Canson Watercolor Paper, 140 lb 300g, Cold Press

No comments:

Post a Comment